రాయదుర్గం: వినాయక చవితి, మారెమ్మ జాతరల నేపథ్యంలో పట్టణంలో కిక్కిరిసిపోయిన మార్కెట్ లు
ఈనెల 14న వినాయక చవితి, 15న మారెమ్మ జాతర నేపథ్యంలో రాయదుర్గం పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం సాయంత్రం నుంచి వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పట్టణంలోని వినాయక కూడలి, కూరగాయల మార్కెట్, బళ్లారి రోడ్డులో మట్టి గణపతులు, పూజా సామాగ్రి, అరటి ఆకులు, పండ్లు, పూల దుకాణాల వద్ద బారులు తీరారు. చిన్న, పెద్ద విగ్రహాల ధరలు రూ.500 నుండి రూ.15 వేల వరకు పలుకుతున్నాయి. వివిధ గ్రామాల నుండి వచ్చిన ఉత్సవ కమిటీల నిర్వాహకులు గణనాథులను వాహనాల్లో తరలించడంతో ప్రధాన వీధుల్లో కోలాహలం నెలకొంది. మంటపాల వద్ద, రోడ్లకు ఇరువైపులా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.