రాయదుర్గం: పట్టణంలో అంబరాన్నంటిన కృష్ణాష్టమి వేడుకలు, యాదవ సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర
శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలతో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం భక్తి శోభతో నిండిపోయింది. శుక్రవారం పట్టణంలోని సుప్రసిద్ధ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతి ఇచ్చారు. స్వామివారిని పూలతో, పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భజన కీర్తనలు, విష్ణు సహస్రనామం, శ్రీకృష్ణ నామ సంకీర్తనలతో మారుమోగింది.