రాయదుర్గం: పట్టణంలో అంగరంగ వైభవంగా అభయాంజనేయ స్వామి రథోత్సవం
రాయదుర్గం పట్టణంలోని మొలకల్మూరు రోడ్డు చెక్ పోస్టు వద్ద వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ మాసం చివరి శనివారం ఇక్కడ రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, రథాంగ హోమం నిర్వహించారు. మడుగుతేరు లాగారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుదీర్చి రామనామ స్మరణ చేస్తూ భక్తులు రథాన్ని లాగారు. రథోత్సవంలో చిన్నారులు, మహిళలు కలశ హారతులు పట్టి పాల్గొన్నారు. ఊరేగింపులో రంగురంగుల బొమ్మల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఊరవాకిలి, తేరు బజార్, వినాయక కూడలి మీదుగా రథోత్సవం సాగింది.