ఉరవకొండ: పెన్న అహోబిలంలో ఘనంగా ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ధ్వజారోహణంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన గరుడపట ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు ద్వారక నాథ,మయూరం బాలాజీ స్వాములు మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో మూలవిరాట్ తో పాటు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి పల్లకి సేవ నిర్వహించారు. ఈ వేడుక కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాయంపల్లి నాగరాజు కార్య నిర్వహణ అధికారి సాకే రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.