కొత్తగూడెం: ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి*
*బీఎల్ఓలే ఇంటింటికీ వెళ్లి నోటీసులు, పత్రాల సేకరణ చేపట్టాలి : సీఈఓ సుదర్శన్ రెడ్డి*
*అత్యవసర విచారణలు ఆన్లైన్లో నిర్వహించాలి*
*ఫారం-6లో డిక్లరేషన్ తప్పనిసరి – పార్టీలకు ఫారం-6, 7, 8 వివరాలు అందుబాటులో ఉంచాలి*
ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రక్రియను పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసులు, పత్రాల స్వీకరణ, విచారణలు, ఫారం-6, 7, 8 తదితర అంశాలపై సమీక్షించారు. ఐడీఓసీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లను కార్యాలయాలకు పిలిపించి నోటీసులు ఇవ్వడం లేదా పత్రాలు స్వీకరించడం చేయరాదని సీఈఓ స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు అవసరమైన పత్రాలను స్వీకరించాలని సూచించారు. అత్యవసరంగా చేపట్టాల్సిన విచారణలను సాధ్యమైనంత వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని తెలిపారు.
ఫారం-6 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో డిక్లరేషన్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఈఓ ఆదేశించారు. అలాగే ఫారం-6, ఫారం-7, ఫారం-8కు సంబంధించిన వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి దశను నిబంధనల ప్రకారం నిర్వహిస్తూ, ఓటర్లకు అవసరమైన సమాచారం సులభంగా అందేలా చూడాలని తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు అంశంపై కూడా సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టమైన సూచనలు చేశారు. ఓటర్ల అర్హత పరిశీలనలో 31-10-2023ను కట్ఆఫ్ తేదీగా పరిగణించాలని ఆదేశించారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకునేలా అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో అందిన సూచనల మేరకు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న నోటీసులను పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని, ప్రతి దశను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్ , సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.