రాయదుర్గం: అగ్నిగుండంలో వేయడానికి పచ్చని చెట్లు నరికివేయవద్దని గుమ్మగట్ట మండలంలో అవగాహన కల్పించిన ఫారెస్టు అధికారులు
మొహరం పండుగ సందర్భంగా అగ్నిగుండం వెలిగించడానికి పచ్చని చెట్లు నరికివేయవద్దని, బదులుగా ఎండు చెట్లు, కంప మొద్దలు వాడాలని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర రెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా కలెక్టర్, డీఎఫ్ఓ ఆదేశాలతో గుమ్మగట్ట మండలంలోని గలగల, గొల్లపల్లి గ్రామాల ప్రజలకు మంగళవారం సాయంత్రం అవగాహన కల్పించారు. వేప, చింత వంటి వృక్షాలు మానవ మనుగడకు ఎంతో అవసరమని వివరించారు. పండుగల పేరుతో వాటిని నాశనం చేయవద్దని హితవు పలికారు. అటవీ శాఖ పండుగలకు వ్యతిరేకం కాదని, పూర్తిగా ఎండిపోయిన వృక్షాలను మాత్రమే తెచ్చి వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.