పెద్దాపురం: మరింత చేరువగా ఉంటూ.. వారి సమస్యలను తెలుసుకుని.. నేరాల నివారణకు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా కాకినాడ జిల్లా పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు.. పెద్దాపురం సీఐ వైఆర్కే ఆధ్వర్యంలో పెద్దాపురం 23వ వార్డు బంగారమ్మ గుడి కాలనీలో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. పోలీసు సిబ్బంది కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నివారణ, శాంతిభద్రతలు, ప్రజల భద్రతపై అవగాహన కల్పించారు.
గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. అదే సమయంలో సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. అపరిచితుల వీడియో కాల్స్ లిఫ్ట్ చేయవద్దని.. ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే బెదిరింపులను నమ్మవద్దని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా అవగాహన కల్పించిన పోలీసులు.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు.