రాయదుర్గం: గుండ్లపల్లి వద్ద KSRTC బస్సు బ్రేక్‌డౌన్, ప్రయాణికులు అవస్థలు
చిత్రదుర్గం నుంచి అనంతపురం వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గుండ్లపల్లి వద్ద బ్రేక్‌డౌన్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం 9.15 గంటలకు సుమారు 50 మంది ప్రయాణికులతో రాయదుర్గం నుంచి బయలుదేరిన బస్సు గుండ్లపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా ఆగిపోయింది. తిరిగి స్టార్ట్ కాలేదు. బ్యాటరీ పాడవడంతో ఇంజన్ ఆన్ కాలేదని డ్రైవర్ తెలిపారు. ప్రత్యామ్నాయ బస్సు సకాలంలో రాకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు కొంతమంది ప్రైవేటు వాహనాలు, ఆటోల్లో కళ్యాణదుర్గం చేరుకుని అక్కడి నుంచి అనంతపురం వెళ్లారు.