గిద్దలూరు: రాచర్ల మండలంలోని అనుమలవీడు, రామాపురం గ్రామాలలో పిచ్చి కుక్కల దాడిలో 6 మందికి గాయాలు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో పిచ్చికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రామాపురం, అనుమలవీడు గ్రామాలలో వృద్ధులు, చిన్నారులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. దాడిలో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఇద్దరు చిన్నారులు ఉండగా ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. గాయపడ్డ వారందరినీ గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాచర్ల మండలం అనుమలవీడు ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ కొరత ఉండటంతో క్షతగాత్రులను గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.