రాయదుర్గం: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అనంతపురం పర్యటనకు వస్తున్న రాష్ట్రపతిని అడ్డుకుంటామని ప్రకటించిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బుధవారం ఉదయం రాయదుర్గం పట్టణంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కావలి కోట్రేష్, పలువురు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్న నేపథ్యంలో నిరసనలు చేపడతామని ప్రకటించడంతో పోలీసులు ఈ ముందస్తు చర్యలు చేపట్టారు.