రాయదుర్గం: పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపి టోకెన్ కోసం గంటల తరబడి రోగులు నిరీక్షణ
పేదల పెద్దదిక్కుగా ఉన్న రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వైద్యం సంగతి అటుంచితే, కనీసం డాక్టర్‌ను కలిసేందుకు ఓపి టోకెన్ దొరకని పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది రోగులు, చంటి పిల్లలను ఎత్తుకున్న తల్లులు, వయో వృద్ధులు ఓపి టోకెన్ కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టోకెన్ ఇస్తుండటంతో, రోగుల వివరాలు నమోదు చేసి రసీదు ఇవ్వడానికి దాదాపు 5 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. వందల మంది రోగులకు కేవలం రెండు కౌంటర్లలో మాత్రమే రసీదులు జారీ చేస్తుండటంతో రద్దీని తట్టుకోలేకపోతున్నాయి.