రాయదుర్గం: మొహర్రం సందర్భంగా పట్టణంలో ఆకట్టుకున్న పులివేషదారణలు
మొహర్రం పండుగ సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని 7వ వార్డు నేసేపేటలో స్థానిక యువకులు శనివారం ప్రదర్శించిన పులివేషాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ఏడూ మొహర్రం సందర్భంగా నేసేపేట, నేతాజీ రోడ్డు, ఓభుళాచారి రోడ్డు, బళ్ళారి రోడ్డు, పీర్ల అగ్నిగుండం ప్రాంతాల్లో యువకులు ఒంటికి రంగులు పూసుకుని పులివేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. డప్పు వాయిద్యాలు, కోలాటాల నడుమ పులి వేట, మేకను పట్టే సన్నివేశాలను కళాకారులు ప్రతిభావంతంగా ప్రదర్శించారు. ఈ నాటకం ప్రదర్శన సందర్భంగా ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.