రాయదుర్గం: ఇసుక అక్రమ రవాణాతో పైపులు పగిలి నియోజకవర్గంలోని 120 గ్రామాలకు తాగునీరు సరఫరా బంద్
కణేకల్లు సమీపంలోని వేదవతి-హగరి నదిలో తరచూ జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలతో తాగునీటి పైప్‌లైన్‌లు పగిలి నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా శుక్రవారం నదిలో ఇసుక తోడుతున్న ట్రాక్టర్లు శ్రీరామిరెడ్డి తాగునీటి మెయిన్ పైప్‌లైన్‌పై వెళ్లడంతో పైప్ పగిలింది. దీంతో లక్షల లీటర్ల తాగునీరు సుమారు 15 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతూ వృథాగా పోయింది. ఫలితంగా రాయదుర్గం, బొమ్మనహాళ్, కణేకల్లు, గుమ్మఘట్ట మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మరమ్మతులకు 2 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాపై అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.