రాయదుర్గం: మహిళలు, బాలబాలికలపై ఎటువంటి నేరాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవు : సిఐ జయనాయక్
మహిళలు, బాలబాలికలపై ఎటువంటి నేరాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని రాయదుర్గం అర్బన్ సిఐ జయనాయక్ హెచ్చరించారు. గురువారం రాత్రి రాయదుర్గం పట్టణం బి.టి.పి. లేఔట్ కాలనీ వాసులతో ఆయన సమావేశం నిర్వహించారు. పోక్సో చట్టం, బాల్య వివాహాలు, మహిళలు, పిల్లల చట్టాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో పోలీసు సహాయం కోసం శక్తి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. మొబైల్ వాడకం పెరిగినందున సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని ప్రోత్సహిస్తే కఠిన శిక్షలు తప్పవని సిఐ స్పష్టం చేశారు.