కొత్తగూడెం: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం
చైర్మన్‌గా డా. ఎస్.ఎల్. కాంతారావు, వైస్ చైర్మన్‌గా చల్లగుల్ల నాగేశ్వరరావు
పాల్వంచ ఐఆర్సీఎస్ భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తాం: కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. జిల్లా శాఖ నూతన చైర్మన్‌గా డా. ఎస్.ఎల్. కాంతారావు, వైస్ చైర్మన్‌గా చల్లగుల్ల నాగేశ్వరరావు, కోశాధికారిగా తోటమల్ల బాలయోగి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా వై. సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 11 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించిన అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ అంకిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారులను నూతన కమిటీ సభ్యులు అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాల్వంచలో ఐఆర్‌సీఎస్‌కు కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదేవిధంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) కార్యక్రమాలను నిర్వహించేలా ఐక్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించడంతో పాటు, రెడ్ క్రాస్ సేవలను విద్యార్థులు, ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు జిల్లా శాఖ అభివృద్ధికి, సేవా కార్యక్రమాల విస్తరణకు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.