కొత్తగూడెం: *వెట్‌ల్యాండ్స్ డీమార్కేషన్, అటవీ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్*
*క్షేత్రస్థాయిలో భౌతిక సరిహద్దుల నిర్ధారణతో పాటు రికార్డుల సమగ్ర పరిశీలన*
*అటవీ ఆక్రమణల నియంత్రణకు రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖల సమన్వయంతో చర్యలు*
వెట్‌ల్యాండ్స్ డీమార్కేషన్, అటవీ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో వెట్‌ల్యాండ్స్ సరిహద్దుల నిర్ధారణ, అటవీ భూముల పరిరక్షణ, ఆక్రమణల నియంత్రణ, అటవీ భూముల మళ్లింపు, ఆర్ఓఎఫ్ఆర్, సంబంధిత శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఐటీడీఏ పీఓ రాహుల్, అదనపు కలెక్టర్ డి. వెంకటగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అంకిత్ సమీక్ష నిర్వహించారు.
వెట్‌ల్యాండ్స్ సరిహద్దుల నిర్ధారణలో కేవలం ఆన్లైన్ రికార్డులు, కేఎంఎల్ మ్యాపింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో భౌతికంగా పరిశీలించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి, క్షేత్రస్థాయి పరిస్థితులను రికార్డులు, కేడస్ట్రల్ మ్యాపులు, అందుబాటులో ఉన్న పాత రికార్డులతో సరిపోల్చి పరిశీలించాలన్నారు. డీజీపీఎస్ సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దానిని వినియోగిస్తూ వేగంగా డీమార్కేషన్ పూర్తి చేయాలని, అవసరమైన చోట మొబైల్ జీపీఎస్ ద్వారా కూడా క్షేత్రస్థాయి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.
వెట్‌ల్యాండ్స్ డీమార్కేషన్లో పాత నీటిపారుదల రికార్డులు, రెవెన్యూ రికార్డులు, సర్వే మ్యాపులు తదితరాలను సమగ్రంగా పరిశీలించి హద్దులను స్పష్టంగా గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన ప్రతి డీమార్కేషన్‌కు సంబంధించిన ఫొటోలు, జీపీఎస్ వివరాలు, ఇతర ఆధారాలను భద్రపరచాలని సూచించారు. ఇప్పటివరకు పూర్తయిన డీమార్కేషన్ పనులను రికార్డులతో మరోసారి సమీక్షించి, మిగిలిన ప్రాంతాల్లో సరిహద్దుల నిర్ధారణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. వెట్‌ల్యాండ్స్‌కు సంబంధించిన కేఎంఎల్ డేటా, కేడస్ట్రల్ మ్యాపులు, రెవెన్యూ రికార్డుల మధ్య ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
వెట్‌ల్యాండ్స్ పరిధిలో ప్రభుత్వ, నీటిపారుదల శాఖ భూములు, ప్రైవేట్ భూములు, ఆక్రమణలకు సంబంధించిన అంశాలను స్పష్టంగా గుర్తించి ప్రత్యేకంగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖల రికార్డుల్లో ఉన్న వివరాలను పరస్పరం సమన్వయం చేసుకుని భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ నిర్వహించాలని సూచించారు.
అటవీ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించి, రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములపై ఉన్న ఆక్రమణలను రికార్డుల ఆధారంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. అటవీ భూముల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి, ఆక్రమణలకు అవకాశం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు . అటవీ ఆక్రమణల తొలగింపు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో చేపట్టే చర్యలకు అవసరమైన సందర్భాల్లో పోలీస్ శాఖ సహకారం ముందుగానే సమన్వయం చేసుకోవాలని సూచించారు. అటవీ సిబ్బందిపై దాడులు, బెదిరింపులు వంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, అటవీ సంరక్షణకు పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
అటవీ భూముల మళ్లింపు, అటవీ భూముల కేటాయింపు, ఫారెస్ట్ క్లియరెన్స్ (ఎఫ్సీఏ), రహదారులు, విద్యుత్ లైన్లు తదితర అంశాల్లో శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ తెలిపారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ భూముల మళ్లింపులో నిబంధనలు, అనుమతులు, పరిహార భూముల వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల్లో అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు, షరతుల అమలును కూడా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఆర్ఓఎఫ్ఆర్ దరఖాస్తులు, కోర్టు కేసులు, రెవెన్యూ–అటవీ భూముల హద్దుల వివాదాలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అర్హత లేని దరఖాస్తుల విషయంలో కూడా నిబంధనలకు అనుగుణంగా స్పష్టమైన కారణాలతో ఉత్తర్వులు జారీ చేయాలని, పెండింగ్ కేసులను మండలాల వారీగా సమీక్షించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అటవీ సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అన్నారు . అటవీ ప్రాంతాలు, అభయారణ్యాల పరిధిలో విద్యుత్ లైన్ల కారణంగా వన్యప్రాణులకు ప్రమాదం జరగకుండా అవసరమైన సాంకేతిక చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్ లైన్ల ఏర్పాటుపై సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
కిన్నెరసాని ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి రూపొందించిన ప్రతిపాదనలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కిన్నెరసాని అభయారణ్య ప్రాంతంలో పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి, సఫారీ, కాటేజీలు, గిరిజన పర్యాటక సర్క్యూట్, మ్యూజియం తదితర ప్రతిపాదనలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రతి శాఖ తన పరిధిలో చేపడుతున్న పనులపై నెలవారీ పురోగతి వివరాలను సిద్ధం చేసుకుని సమీక్షకు సమర్పించాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. అటవీ, రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల, ఆర్అండ్బీ, విద్యుత్, ఐటీడీఏ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే భూ పరిరక్షణ, అటవీ సంరక్షణ, అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.
ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం. విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, భద్రాచలం ఎఫ్డీఓ నిషా, కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్లు, అటవీ, రెవెన్యూ, నీటిపారుదల, పోలీస్, విద్యుత్, ఆర్అండ్బీ, ఐటీడీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.