కొత్తగూడెం: రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
ఆహారం, పారిశుధ్యం, హాజరు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు
చలికాలంలో వెచ్చని నీరు, దుప్పట్లు అందుబాటులో ఉంచాలి
దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన యూనిఫారాలు అందేలా చర్యలు
ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యతో పాటు వారికి అందుతున్న మౌలిక వసతులపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కలెక్టర్లు క్రమం తప్పకుండా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఆహార విషబాధ, ఎలుకలు, పాముకాటు వంటి ఘటనలు చోటుచేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని సీఎస్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఆహారం తయారీ, ఆహార పదార్థాల నిల్వ, వినియోగంలో నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ విధానాలను తప్పనిసరిగా పాటించాలని సీఎస్ తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల లోపాలు తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. వంటశాలలను ఆధునీకరించే అవకాశం ఉన్న చోట్ల పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను ఉన్నతస్థాయిలో పర్యవేక్షించేందుకు రూపొందించిన డ్యాష్‌బోర్డ్‌ను కలెక్టర్లు క్రమం తప్పకుండా పరిశీలించాలని సంజయ్ జాజు తెలిపారు. విద్యాసంస్థల్లోని సౌకర్యాలు, లోపాలు, చేపట్టిన పరిష్కార చర్యల వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో చేపట్టిన మార్పులను ఉన్నతస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుంటుందని తెలిపారు.
జిల్లాలో రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సంబంధించి ప్రతికూల నివేదికలు వచ్చినప్పుడు అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని సీఎస్ సూచించారు. ఏదైనా సమాచారం తప్పుడు ప్రచారంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, వాస్తవంగా సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి అమలు చేస్తోందని, కాస్మెటిక్ ఛార్జీలను డీబీటీ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.
రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్నానానికి వెచ్చని నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన దుప్పట్లను ముందుగానే సమకూర్చాలని సీఎస్ ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థల భవన యజమానులతో కలెక్టర్లు సమావేశమై అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణ అందేలా చర్యలు చేపట్టాలని సీఎస్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ప్రతిరోజూ ఒక లక్ష యూనిఫారాలు కుట్టేలా చర్యలు తీసుకోవాలని, దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన యూనిఫారాలు అందేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. యూనిఫాం క్లాత్ ఇప్పటికే జిల్లాలకు చేరినందున కుట్టు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలు, సమస్యల పరిష్కార వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో క్రమం తప్పకుండా అప్డేట్ చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు.
*అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ* , జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు రెసిడెన్షియల్ విద్యాసంస్థలను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, ఆహారం, పారిశుధ్యం, హాజరు, మౌలిక వసతులపై నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వెచ్చని నీరు, దుప్పట్లు తదితర అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన యూనిఫారాలు అందించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు.
జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సంబంధించిన వివరాలు, సమస్యలు, చేపట్టిన పరిష్కార చర్యలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపడతామని కలెక్టర్ అంకిత్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీలత సంబంధిత శాఖల అధికారులు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు.