అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పరిధిలోని కసాపురం గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో కనుమ పండుగను పురస్కరించుకొని గోపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. శుక్రవారం ఈఓ మేడేపల్లి విజయరాజు ఆధ్వర్యంలో గోపూజ చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఈ సందర్భంగా గోవులను పూలతో అలంకరించి, కుంకుమ పూసి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. గోపూజ చేయడం పుణ్యకార్యం అని అర్చకులు వివరించారు. గోపూజ వలన సకల శుభాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు, వేద పండితులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.