గుంతకల్లు: పట్టణంలోని మోమినాబాద్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పండ్ల దుకాణం దగ్ధం, రూ.50వేలు నష్టం
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని హనుమేష్ నగర్ లోని మోమినాబాద్ స్ట్రీట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పండ్ల దుకాణం దగ్ధమైంది. గుంతకల్లు అగ్నిమాపక శాఖ సహాయ అధికారి అశ్వర్థ, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మోమినాబాద్ వీధిలో సయ్యద్ బాష అనే వ్యక్తి పండ్ల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యజమాని పరుగున బయటకు వచ్చి స్థానికుల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు.