గుంతకల్లు: గుత్తి మండలం శ్రీపురం గ్రామ శివారులో తేనెటీగలు దాడి, ఆరు మంది రైతులకు గాయాలు, గుత్తి ఆసుపత్రికి తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి మండలం శ్రీపురం గ్రామంలో శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తున్న వారిపై తేనెటీగలు దాడి చేయడంతో ఆరు మంది గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీపురం గ్రామానికి చెందిన రాముడు, రామమునేంద్ర, మల్లేశ్వరి, శివలక్ష్మి, వెంకటేష్, లక్ష్మీదేవిలు వారి పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. పొలాలు శుభ్రం చేసి పంటల సాగుకు సిద్ధం చేస్తున్నారు. పొలం గట్టు వద్ద ఉన్న చెత్తకు మంట పెట్టగా పెద్ద ఎత్తున పొగ వెలువడి తేనెటీగలు చెదిరి వారిపై దాడి చేశాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.