అల్వాల్ పరిధిలో BRS, BJP పార్టీల మధ్య మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మచ్చ బొల్లారంలోని రైల్వే ఆర్యూబీ (అండర్ బ్రిడ్జి) పనులకు రూ.6.6 కోట్లు నిధులు BRS ప్రభుత్వం తీసుకువచ్చిందని పేర్కొంటూ మల్కాజిగిరి MLA రాజశేఖర్ రెడ్డి పేరిట బ్యానర్ వెలిసింది. ఈ బ్యానర్‌ను ఖండిస్తూ, ఆ నిధులు తామే తీసుకువచ్చామని BJP శ్రేణులు వాదించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పరస్పరం నినాదాలు చేసుకున్నారు. ఘటన స్థలంలో ఏర్పాటు చేసిన స్టేజీపై మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, MLA రాజశేఖర్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాజకీయ నేతల వ్యాఖ్యలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.