జహీరాబాద్: శాంతినగర్ లో కొండముచ్చు దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కొండముచ్చులు వీరంగం సృష్టిస్తున్నాయి. శాంతినగర్ కాలనీకి చెందిన అమర్ అనే యువకుడికి సోమవారం ఉదయం కొండముచ్చు దాడి చేసి కాలు పై తీవ్రంగా గాయపరిచింది. అతడిని వెంటనే స్థానికులు జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత మూడు నాలుగు రోజులుగా పట్టణంలోని రామ్ నగర్, గాంధీనగర్, శాంతినగర్ ప్రాంతాల్లో కొండముచ్చులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ పదిమందికి పైగా గాయపరిచాయి. కొండముచ్చుల దాడితో చిన్నారులు, మహిళలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కొండముచ్చులను పట్టణం నుండి తరలించాలని కోరుతున్నారు.