అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని జక్కలచెరువు గ్రామ శివారులోని ఎన్టీఆర్ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బుధవారం మంటలు చెలరేగాయి. కాలనీలో ఇళ్ల మధ్యలో ఉన్న విద్యుత్ తీగల నుంచి ఒక్కసారిగా భారీ శబ్దాలతో తీగలో మంటలు వచ్చి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. అది చూసిన కాలనీ వాసులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. కాలనీలో రోడ్డుకు మధ్యలో తీగలు వేలాడుతూ తరచూ మంటలు వస్తున్నాయని కాలనీ వాసి రమేష్ తెలిపాడు. విద్యుత్ అధికారులు చర్యలు తీసుకొని విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.