హనుమంతునిపాడు మండలంలోని దాసరిపల్లిలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు శనివారం పర్యటించారు. జల సురక్ష మాసం సందర్భంగా గ్రామంలోని నీటి వనరులను, మంచినీటి ట్యాంకులను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలని, ఆ తర్వాత ట్యాంకులను నీటితో నింపి, క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని పంచాయతీ సిబ్బందిని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. నీటి నమూనాలను ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎంపీడీవో రంగ సుబ్బారాయుడు పాల్గొన్నారు.