విశాఖపట్నం: యోగా వేడుకలో పాల్గొనే ప్రజలకు రవాణా సదుపాయంపై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రుల సమీక్ష
ఈ నెల 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రజలకు కల్పించే రవాణా సదుపాయంపై మంత్రులు సమీక్షించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మీటింగు హాలులో రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజలు సులభంగా ఆయా వేదికల వద్దకు చేరుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వాహనాల కేటాయింపు, తరలింపు, పార్కింగ్ తదితర విషయాల్లో అనుసరిస్తున్న విధానాలపై అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ రాకుండా పక్కా చర్యలు చేపట్టాలని సూచించారు.