అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి
అచ్యుతాపురం మండలంలో తిమ్మరాజుపేటకు చెందిన అయితంశెట్టి రాము(30) విద్యుదాఘాతంతో ఆదివారం మృతి చెందారు. గ్రామంలో ఇన్వర్టర్ దుకాణం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న ఈ యువకుడు, కొండకర్లలో ఓ ప్రైవేటు రిసార్ట్స్ ఎలక్ట్రికల్ పని చేస్తుండగా విద్యుత్తు షాక్‌కు గురై మేడపై నుంచి కిందకు పడిపోయాడు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. కొనఊపిరితో ఉన్న అతనిని అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అందరితోనూ మంచిగా ఉండే రాము మృతితో తిమ్మరాజుపేటలో విషాదం నెలకొంది. భార్య గౌతమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.