కణేకల్లు మండలం బ్రహ్మసముద్రం గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆనంద్ అనే రైతుకు చెందిన పశుగ్రాసానికి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 ఎకరాల్లో సాగుచేసిన వరి గడ్డి మెత్తం కాలి బూడిదయింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో తన కళ్లముందే పశుగ్రాసం కాలిపోయిందని రైతు వాపోయారు. సుమారు లక్ష రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు తెచ్చారు. అయితే అప్పటికే పూర్తిగా కాలిపోయిందని స్థానికులు తెలిపారు.