అనంతపురం శివారులోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓ మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మద్యం దుకాణానికి నిప్పు పెట్టినట్లు యజమాని నంబూరి వెంకటరమణ అనుమానం వ్యక్తం చేశారు. కాపలాదారుడు లేని సమయం చూసి మద్యం దుకాణం ముందు ఉన్న ఆటోను తగలబెట్టినట్లు తెలిపారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో మంటలను ఆర్పేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మద్యం దుకాణంలో సగానికి పైగా మద్యం బాటిళ్లు కాలిపోయాయి. ఈ సంఘటనకు సంబంధించి నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.