నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మాంస అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు హెచ్చరించారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో అనంతపురం నగరంలో ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయన పలు మాంసపు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పలు దుకాణాలలో పరిశుభ్రత పాటించకుండా మాంసం విక్రయిస్తున్నట్లు గమనించి జరిమానాలు విధించారు. మరో మారు అపరిశుభ్ర వాతావరణంలో, నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.