జీ.మాడుగుల మండలంలోని కే.కోడాపల్లి గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ ఛైర్మన్ వంపూరు గంగులయ్య సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం సచివాలయం పరిధిలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని పరిశీలించారు. సకాలంలో పెన్షన్ అందుతుందా లేదా అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు.