ప్రకాశం జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అనుగుణంగా రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనములో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. వివిధ పథకాలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా మంజూరైన రుణాల వివరాలను ఎల్.డీ.ఎం. రమేష్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ దిశగా, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని ఆయన సూచించారు.