అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని స్పెషల్ సబ్ జైలును జిల్లా న్యాయ సేవా సమితి జిల్లా కార్యదర్శి ఎన్.రాజశేఖర్ తనిఖీ చేశారు. పట్టణంలోని జైలుకు శనివారం గుత్తి ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.సాదుబాబు ఆధ్వర్యంలో జైలుకు వెళ్లి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జైలులోని రికార్డులతో పాటుగా వంటగది, నిత్యవసర వస్తువులను ఉంచే స్టోర్ గది, ఖైదీల బ్యారెకులు, మరుగుదొడ్లను వారు పరిశీలించారు. తాగునీటి సరఫరా గురించి విచారించారు. ఖైదీలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఖైదీలను ఆరా తీశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు.