మామడ మండలం వాస్తాపూర్, తాండ్ర, మొండిగుట్ట గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేదోడికి గూడు కల్పించాలని ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, కానీ ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక విషయంలో అటవీ శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ నుండి ఇసుకను తీసుకువచ్చే క్రమంలో అధికారులు వాహనాలను సీజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.