వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. శనివారం సాయంత్రం సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను కలెక్టర్ సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అవసరమైన అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మహబూబ్ సాగర్ చెరువు కట్టపై విద్యుత్ దీపాలతో అలంకరించడంతోపాటు అవసరమైన భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.