ఎవరైనా లైసెన్స్ లేకుండా ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చింతపల్లి మండల వ్యవసాయ అధికారి (ఏవో) మధుసూధనరావు హెచ్చరించారు. జీకేవీధి మండలం ధారకొండలో ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆదివారం సాయంత్రం ధారకొండలో పలు దుకాణాలను తనిఖీ చేసి, విచారణ జరిపామన్నారు. అధిక ధరలకు విక్రయాలు జరగలేదని రైతులు తెలిపారన్నారు. ఎవరైనా ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.