నిజామాబాద్ నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం పని తీరుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రెవెన్యూ విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశమై పన్ను వసూళ్లలో ప్రగతి, న్యూ అసెస్ మెంట్, మ్యుటేషన్ దరఖాస్తుల ఫైళ్లను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ కాలం నుంచి పలు మ్యుటేషన్ ఫైళ్లు పెండింగ్ లో ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వాటి విషయమై సంబంధిత జోన్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ప్రశ్నించారు. సత్వరమే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, తద్వారా నగర పాలక సంస్థకు ఆదాయం కూడా సమకూరుతుందని కలెక్టర్ సూచించారు.