బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తీవ్రమవుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం రాత్రి ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, ఈ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా మరింత బలపడి, అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.