ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య, ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే యంచ శివారులోని గోదావరి బ్రిడ్జి వరకు గల మార్గాన్ని పరిశీలించారు. ఈ మార్గంలో దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.