అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సీపీఐ, సీపీఎం ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో బషీర్ బాగ్ కాల్పులలో అశువులు బాసిన ముగ్గురు అమర వీరుల చిత్ర పటాలకు వారు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ తాడిపత్రి పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన చేస్తున్న క్రమంలో అప్పటి సీఎం చంద్రబాబు పోలీసుల చేత కాల్పులు జరిపించగా ముగ్గురు చనిపోయారని అన్నారు. 2000 సంవత్సరం ఆగష్టు 28న ఘటన జరిగిందన్నారు.