విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని నెల్లిమర్ల-రణస్థలం ప్రధాన రహదారిలో ఆల్తిపాలెం జంక్షన్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతి వేగంతో వెళుతున్న రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొట్టుకున్నాయి. అదే సమయంలో వస్తున్న మరో బైకును కూడా ఢీకొట్టడంతో మూడు ద్విచక్రవాహనాలు రోడ్డు పై చెల్లా చెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో సతివాడ, రాగోలు గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 108 సహకారంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.