జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన బోధన్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. గోదావరి ఉద్ధృతి వల్ల నవీపేట్ మండలం యంచ, అల్జాపూర్, మిట్టాపూర్, కోస్లీ తదితర ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రవాహం దాటికి కొట్టుకుపోయిన పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ట్రాన్స్ ఫార్మర్లు తదితర వాటిని పరిశీలించారు. వరద నీటిలో మునిగి ఇసుక మేటలు వేసిన వరి, మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను పరిశీలించారు.