ఇటీవల జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిన ప్రాంతాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. ఇందల్వాయి – భీంగల్ ప్రధాన మార్గంలో ధర్పల్లి మండలం పాటితండా వద్ద వరద ప్రవాహానికి దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. అదేవిధంగా సిరికొండ మండలం కొండూర్ శివారులో వరద తాకిడి వల్ల దాదాపు కిలోమీటరు వరకు పెద్ద ఎత్తున దెబ్బతిన్న బీ.టీ రోడ్డును, కూలిన హైలెవెల్ బ్రిడ్జి, చెక్ డ్యాంలను పరిశీలించారు. నీట మునిగిన పంటలు, కూలిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన కరెంటు తీగలు, ఇసుక మేటలు వేసిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.