జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు, రహదారులు, భవనాలకు అధిక నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాఖల వారీగా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. వ్యవసాయం, విద్య, విద్యుత్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖలకు సంబంధించిన వరద నష్టం, సర్వే తదితర అంశాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై ప్రతి శాఖ క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి అంచనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.