సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిమ్జ్ భూ నిర్వాసిత రైతులు, కార్మికులు ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయం నుండి జాతీయ రహదారి మీదుగా నిమ్జ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం నిమ్జ్ రైతులకు పరిహారం అందజేయాలన్నారు. రైతు కూలీలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా లో నాయకులు, భూ నిర్వాసిత రైతులు, కూలీలు పాల్గొన్నారు.