గోదావరిలో వరద తగ్గుముఖం పట్టడంతో మామిడికుదురు మండలంలోని లంక గ్రామాల ప్రజలు ఉపశమనం పొందారు. అప్పనపల్లి కాజ్వే ముంపు నుంచి బయటపడటంతో ఆ మార్గంలో భారీ వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు వరద ముప్పు తొలగిపోయింది. దీంతో ఆ మూడు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పనపల్లి స్నానాల రేవులో వరద ఉద్ధృతి కొంతమేర తగ్గింది.