జన్నారం మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు వేసుకున్న పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టం వాటిలిందని శుక్రవారం బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలం తిమ్మాపూర్ లో రైతులు లచ్చయ్య,భూమయ్య, మల్లయ్యకు చెందిన 2 ఎకరాల చొప్పున వరి పైరు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అలాగే గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న రైతు మల్లేష్ కు చెందిన ఆరేకురాల పత్తి పూర్తిగా నీళ్ల పాలయిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతుల మిర్చి,పసుపు,మొక్కజొన్న పంటలు కూడా నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.