విశాఖ సాగర తీరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అల్పపీడన ప్రభావంతో చల్లని గాలికి సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అదే సమయంలో వేల సంఖ్యలో కొంగలు ఒక్కసారిగా సాగర తీరంపై వాలిపోయాయి. ఆకాశమంతా తెల్లని మేఘాలు కమ్ముకున్నాయా అన్నట్టుగా తీరం పొడవునా తెల్లని కొంగలే దర్శనమిచ్చాయి. చల్లబడిన వాతావరణంతో చేపలు నీటిపైకి వస్తుండటంతో, వాటిని పట్టుకోవడానికి కొంగలన్నీ పోటీ పడుతున్నాయి. ఒక్కో కొంగ సముద్రం ఉపరితలం నుంచి రివ్వున ఎగురుతూ, ముక్కుతో చేపలను పట్టుకుంటున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి పర్యాటకులు ఆనందంతో కేరింతలు కొట్టారు.