వినాయక చవితి వేడుకలకు విశాఖపట్నం సర్వం సిద్ధమైంది. నగరమంతా పండుగ శోభ సంతరించుకుంది. పండగ ఇంకా రెండు రోజులు ఉండగానే, ప్రజలు వినాయక విగ్రహాల కొనుగోలుకు ఉత్సాహం చూపిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా పాత పోస్టాఫీసు, అసిల్‌మెట్ట, మద్దిలపాలెం, సీతమ్మధార వంటి ప్రదేశాలలో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను విక్రయానికి సిద్ధం చేశారు. ఆదివారం కావడంతో చాలా మంది విగ్రహాల కొనుగోలుకు మార్కెట్‌కు తరలివచ్చారు. ఈసారి మట్టి విగ్రహాల పట్ల ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో, రసాయన రంగులు లేని మట్టి విగ్రహాలకు మంచి గిరాకీ ఉంది.