వానాకాలం వచ్చినా వరుణ దేవుడు కరుణించడం లేదని ప్రజలు వాపోతున్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వర్షాలు సమృద్ధిగా కురవాలని తాంసి మండలం హస్నాపూర్ గ్రామస్థులు సోమవారం సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు ఆడారు. ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లికి నీటితో అభిషేకం చేశారు. అనంతరం చిలకల భీమన్న దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.