జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 460 కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరిగిందని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్. దామోదరరావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదాలను పరిష్కరించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కక్షిదారులు రాజీ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయన్నారు.